26, నవంబర్ 2015, గురువారం

సేవించనీ..సేవించనీ....
శ్రీవారి పాద పద్మాల పూజించనీ ..
శ్రీ వెంకటేశ్వరుని అర్చించనీ ....
శ్రీనివాసునికి ..నీరాజనం..
అర్పించనీ..అర్పించనీ....
రమణి ముద్దూగుమ్మ ..
పద్మావతీ అమ్మ..
అలరించి... మురిపించి
అలసి... సొలసిన వేళ
స్వామి..చిధ్విలాసపు
చిరునగవు చిందించుచూ
నిదురించి ఉన్న వేళ ..//సేవించ//
వరహాల మూటలు
నాకేల స్వామి..
నీ విచ్చు అభయహస్తము
కన్నా మిన్న యేమి..
అనునిత్యము.. నీ ధ్యానమే..
మది నింపరా స్వామి..
కను పాపలలో .చెదరని నీ రూపము ..
కంటి నీరై కరుగనీయని వేళ .//సేవించ//
గోవిందా...
గోవిందా అని
పిలిచిన చాలును
జనులారా.... 
పిలుపు పెదవి
దాటకమునుపే
పరుగున వచ్చి
నిలచును హృదయమున
రెప్పలు మూసినా...
కనిపించును స్వామి
కరుణామయుడు..కనరండీ....
శిలగా మారిన స్వామీ
తనను నమ్మిన వారికై....
వెన్నలా కరిగిపోవునే....
వారి జీవితమంతా
వెన్నెలనే కురిపించునే....
గోవిందా అని
పిలచిన చాలును
జనులారా....
ముల్లోకాలకూ అధిపతియై
ప్రజల కాపాడుటకూ
యుగయుగాలనుండీ
అవతారాలెన్నో మార్చెనే....
అభయహస్తమిచ్చి
ఆపదలబాపుచూ
ఈ యుగమందున
వెంకటాద్రిపై వెలిసెనే...
కలియుగ దైవమై నిలిచెనే..
గోవిందా అని
పిలచిన చాలును
జనులారా.....
శ్రీ రంగనాధా...
పలుకులను లోలోన
దాచుకొని..
పవ్వళించితివా..
రంగనాధా...!!
శ్రీ రంగనాధా..!!
ఇహములోన నను
ఇక్కట్లకు గురిచేసి
వేదనతో నే వేడుకుంటున్నా...
వినిపించుకొని కూడా..
చిరునగవుల నీవు..
నా చింతలన్నీ మరచి ... //పలుకులను//
వింజామరల మెల్లగ
వీచేగా..భూదేవి..
సుతిమెత్తగ పాదాలు
వత్తెగా.. శ్రీదేవి..
సపర్యల సల్లాపములలో
సాంతముగా..అన్నీ మరచి....//పలుకులను//
ప్రేమారాదనల మాలలతో...
నిను సేవించీ..పూజించీ..
నిన్నే భర్తగ పొందెనుగా..
గోదాదేవి...
ఆ తల్లి లాలుల ఊయలలో..
సాంతముగా అన్నీ మరచి ......//పలుకులను//
స్వామి చరణాల వాలేదేలా..!!

అభయ హస్త మిచ్చి ఆపదల గాచుచు...
అన్నీ తానై...తలనీలాలను ముడుపుగా చేకొను స్వామి..
గోవింద ...గోవింద ..అని తలచినంతనే..
హృదయంలోనికి పరుగు పరుగున వచ్చి చేరే స్వామి.
.
వైకుంఠముని వీడి ..శేషగిరిపై..శిలగా మారి..
కలి పాపాలనుంచి కాపాడ..వేంకటేశ్వరుడై నిలిచిన స్వామి..
నిత్య కళ్యాణాలతో...పూజా కైంకర్యాలతో..సేవలందుకుంటూ..
క్షణమాత్రం దర్శనం తోనే..జన్మతః పుణ్యఫలం ప్రసాదించు స్వామి..

ఆ స్వామి దివ్య లీలలను వింటూ...ఎప్పుడెప్పుడా ..
శ్రీనివాసుని కన్నుల నిలుపుకొను భాగ్యమని తలపోస్తూఉన్నా..
గుండె గుబులాయె..మరి..ఏడేడు కొండలు ఎక్కాలంటే...
చేతిలో కానీ లేక..చెంతను శక్తి లేక..చేరేదెలా ..?.
స్వామి చరణాల వాలేదేలా..?
సతమతమయ్యే ప్రశ్నలతో..
ఎదతలపులలో ఆ వెంకన్నని నిలుపుకొని..
నిరీక్షిస్తూ ఉన్నా...నిజమయ్యే ఆ ఘడియ కోసం...!
ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.!
శ్రీ వేంకటేశ్వరుడు
వైకుంఠవాసుడు
శ్రీవేంకటేశ్వరుడు
భగవంతుడు వాడే
పిలిచిన పలికేటివాడు.....
సిరులెన్నొ కలవాడు
శ్రంగార పురుషుడు
శ్రీలక్ష్మి సిగలోన
సిరిమల్లె అయినాడు //వైకుంఠ//
ఏడుకొండెలెక్కి తాను
కొలువై ఉన్నాడు
కోరి వచ్చే వారి..
ఆపద్భాందవుడు //వైకుంఠ//
అల్లనల్లన మెల్లమెల్లగ
అన్నమయ్య హృదయముదోచి
ఆంద్రుల ప్రతి ఇంటను నిలిచి
అవతార మూర్తి అయినాడు //వైకుంఠ//

10, సెప్టెంబర్ 2015, గురువారం

"కాలం.."

కనిపించదు...
కానీ ..
కదులుతుంది...
వినిపించుకోదు ..
కానీ..
గుబులు రేపుతుంది..
దైవత్వం అయినా...
రాక్షసత్వం అయినా...
జంకు లేక సాగుతుంది..
రాజయినా..పేదయినా..
రెప్ప పాటులో మాయ చేసి..
తనపాటికి తాను తాపిగా ..
నడుచుకుంటూ....
వెళ్ళిపోతూనే ఉంటుంది..
"కాలం.."
ఉపశమన తరంగాలు మిత్రులకు సభ్యులకు శుభ సాయంత్రం.. చిత్రాక్షరి-3 రాదా కృష్ణుల వర్ణన . తృతీయ విజేత శ్రీమతి సుజాత తిమ్మన గారు
Sujatha Thimmana **********రాధామనోహరం*********
మోహనుని కొసచూపుల కవ్వింతలు..
రాధ ఎదలోని ప్రేమామృతధారలను 'చిలుకు'తూ
ఉన్న రాసాస్వాదనల తెలియాడుచూ ..తాను మౌని అయింది..
మురళీధరుని గాన విన్యాసముల గాంచుచూ ..
మధువనిలోని పూ భాలల మధువులు 'ఒలుకు '
ప్రణయ వీవనల స్పర్శలో సర్వం మరచిన సరిజమయింది..
శిఖిపించసరాగాల విలాసములలో..తేలియాడు సఖి
మది గదిలోదాగిన బావాల పరంపరల ' పలుకు 'ల
తేనెల వానలలో తడిచి ముఖుళించిన అరవిందమైంది..
యముననీటి తరగలపై అలవోకగా నడయాడు పూలనావలో..
సఖుని సందిట బందీఅయిన చెలి ఎరుపెక్కిన చెక్కిళ్ళ ‘ కులుకు ‘
మదన తాపమున మాధవుని కదలనీయక విడివడని జాలమయింది..


బుజ్జి తండ్రి..
అమ్మమ్మ వడి నీకు
హంస తూలికా తల్పమేరా..
నా కన్నా....
మీ అమ్మ ఊగిన
ఉయాలే రా..ఇది
నా కన్నా .
జో జో లు కొట్టేను ..
లాలి లాలి అని పాడేను..
అన్ని మరచి నిదుర పోరా..
నా కన్నా..
రాముడై ఎదిగి.
విలు విద్యలే చూపేవో..
ఒక్క మాటపై నిలిచి..
ఇల ధర్మమే నిలిపేవో..
కృష్ణుడిగా మారి..
వెన్న ముద్దలే తినేవో..
గోపెమ్మెల చుట్టూ చేరి..
గోల గోల చేసేవో..
గాజు కన్నుల కలలు
ఫలియింప గాజేసి..
నిండు నూరేళ్ళు
జీవించు తండ్రి..
ఆపైన వెయ్యేళ్ళు
నీ పేరు ..
అమరమై నిలువ..
సిరిని చేపట్టిన వాడు
శ్రీనివాసుడు నిను
కాపాడు గాక..
సమస్తము తానైన
సాయి నాధుడు నిను
సంరక్షించుగాక..
అమ్మమ్మనై నీ ఆలనల
ఆనందాలే పొందేనురా..
నీ ఆయువుల శ్వాసిస్తూ..
నా ప్రేమల .. నిను బందిస్తూ..
నా కన్నా...నా నాన్నవేరా..
చిన్ని తండ్రీ...బజ్జోరా..బుజ్జి తండ్రి..!
..
*********జననీ*************
అర్ధరాత్రి ఆకాశంలోనికి ..ఎగ బాకింది..
"బోలో స్వతంత్ర భారత్ కీ జై.." అన్న నినాదం..
చీకటిని చిల్చు కుంటూ దూసుకెళ్ళే తారాజువ్వై...
జంబూద్వీపమై ..ప్రాచిన సంపదని కాపాడుతూ..
వేదాల సారాలను తనలో ఇముడించుకొని..
సంస్కృతీ సంప్రదాయాలదేవాలయమై నిలిచింది...
తూటాలతో వచ్చి తెల్లదొరలు దేశాన్ని ఆక్రమించి
అరాచకత్వాల ప్రజలను పీడిస్తుంటే.....తమను మరచి
సౌఖ్వం విడిచిన ఎందరో మహానుబావుల త్యాగ ఫలమిది ..
ఆకును సైతం కదలనీయని అహింసాయుతంతో..
సుష్కిస్తున్న శరీరాన్నికూడా లెక్కచేయని సత్యాగ్రహంతో..
గాంధీజీ మాట పై నిలిచి తెచ్చుకున్న స్వాతంత్రమిది..
అక్షరాల గింజలేసి..కార్యదీక్షతో పండిచుకొన్న
ప్రగతి పంటను...భావి భవితకు కానుక చేస్తూ..
పసి హృదయాలలో.. దేశభక్తిని నింపుదాం..
కన్నతల్లి స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది..
జన్మభూమి నిచ్చిన భారతమాత..
ఉపిరి ఉన్నంత వరకూ ఊతమిచ్చి..
శ్వాస విడిచిన కాయాన్ని తనలో కలుపుకొంటుంది..
ఆ తల్లిని కాపాడుతూ....మాననీయతతో జీవిద్దాం..!
కదలి పోతున్న
క్షణాల పోగుల రాసులలో..
దాగిన జ్ఞాపకాల నిధివి నీవు..
చూపుల చీనాంబరానికి..
మాటల మాణిక్యాలనతికించి..
ఎదుటివారి హృదయానికి
అలంకరించేవు...
సమన్వయపు సహనము
నీ ఉపిరి..
అందుకే..
ప్రతి వారికీ అనిపిస్తుంది...
నీ సమక్షం..
ఎప్పుడు శాంతి కపోతాల నిలయమని..
అందుకే..
నీ తలపులపెనవేసుకున్న
నా ప్రాణాలు...
లోలోన నీతోనే జీవిస్తూ...
వేచిఉన్నాయి...
నిన్నుచేరే ఘడియకోసం..!


వచ్చినాడమ్మా..
వెన్నదొంగ..
ఎదలోనె దాగి..
దోబూచు కనులతో..
అటు..ఇటు..చూస్తూ..
పెదవులతో సున్నా చుట్టి..
బూరెలంటి బుగ్గలని ఎర్రగా చేసి..
అడుగుకు..అడుగు కలుపుతూ..
వంచిన బుజాల కుదుపుతూ..
నీలి వర్ణమైనా..
నిగనిగల మెరుపులతో..
మిల..మిలల తళుకులతో..
అలా...అలా...మెల్లగా...
చేరి..వచ్చినాడమ్మా....
ఎనక చేరి రెండు కళ్ళుమూసి..
వెన్నంటిన నోటితో...
ఒక్క ముద్దే ఇచ్చినాడమ్మా...
నా చిన్ని కృష్ణుడు..!


జో...జో...
అలకలన్నీ తీరి
అలివేలు మంగ..
అచ్చంగ విభునికి 
అన్ని అర్పించంగ...
కాటుకంటిన శ్రీవారి
బుగ్గలు నిగ్గు తేలంగ
అది చూసి నవ్వింది ..
అమ్మలగన్న అమ్మ..
మురిపెంగా...
సతి సాన్నిధ్యము లోని
సరసాల సౌఖ్యాలు ..
అనుభవములోన మగనికి
ఆనందాల పొదరిళ్ళె...
ఆలు మగల అన్యోనతలోన
మధుమాసానికి... ఎపుడు
ఆవాసమేలే...
పాల కడలి అలల నురగల
తేలేటి శేష తల్పముపైన..
సేద తీరి నట్టి..
చిద్విలాసపు నగవుల
శ్రీనివాసుడ వేలే..
నడిరేయి దాటుతున్నది..
తొలిజాముకు దగ్గరవుతూ..
గుండె సడిలోన గువ్వలా ఒదిగి..
పవ్వళించరా..స్వామి..!
నాశ్వాసలోని నీ నామ జప తెరలోన..
జో..జో...!....జో..జో...!

31, మార్చి 2015, మంగళవారం

లలిత...


లలిత లావణ్య వతి అయిన మా ఇంటి ఆడబిడ్డ 
లక్ష్మి కళ ఉట్టి పడుతూ...నట్టింట తిరుగాడుతుంటే..
లయ బద్దమయిన నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది..
లక్షల కట్నం ఇచ్చి అయినా సరే...
లక్షణమయిన వరుని తేవాలని ...
లంఖణాలు చేస్తూ...మరీ వేదన చెందుతూ ఉన్నా..
లంగరు వేసినా ఆగని నావలాగా...
లక్ష్యం చేరని బ్రతుకవుతుందేమో అని దిగులు...
లంబోదరునకు అనేకానేక దండాలు పెట్టించి..
లడ్డూల నివేదన ... చేయించి...
లకారానికి తగ్గని జీతం ఉన్న అల్లుణ్ణి ఈయమని వేడుకుంటున్నా..!

30, మార్చి 2015, సోమవారం



.నా చెలికాడు....!

రమ్మని చెప్పిన చెలికాడు 
'రవళి ...నీకోసం నేనున్నా..అంటూ..

రవ్వల లోలకులు తెస్తాడు అనుకున్నా.
రంగుల సినిమా చూపిస్తాడనుకున్నా...
రహస్యం... అని చెవిలో ..గుసగుసలు చేపుతాడనుకున్నా...
రవిక బిగువులదాచిన వలపులు దోచుకుంటాడనుకున్నా..
రసాత్మకపు తేనెలనందిస్తాడనుకున్నా..
రవి అస్తమించే సమయమవుతున్నా...
రమణీయ మయిన ప్రకృతి ..
రతీమన్మధులకు స్వాగతం చెపుతున్నా..
రవ్వంత కనికరం చూపక వెన్నెలరేడు పున్నమి కన్ను గీటుతున్నా..
రగిలే ఎదలో సెగలు రేపుతూ.. రాడాయె ఎంతకీ ...నా చెలికాడు....!!

21, మార్చి 2015, శనివారం

మామిడాకులు మళ్ళి మళ్ళి రమ్మని పిలుస్తుంటే...
లేత చుగుళ్ళను మేసిన మత్త కోయిల
 కుహు..కుహు ..అంటూ..స్వాగతిస్తూ ఉంటె..
ప్రకృతి కన్య ..శిశిరాన్ని విడిచి వసంతపు కొత్త వలువలు కట్టుకొని..
మల్లెల దండల ద్వారాన వేచి చూస్తుంటే..
చైత్రమాసపు వేప పువుల వగరు వాసనతో..
మదిలో చెలరేగే వలపు చూపుల తూపులతో...
మన్మధ నామదారి అయిన కొత్త వత్సరం..
అరుదెంచె నదిగో..